ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం.

ముక్కు పచ్చలారాని పసిపాపల నుంచి పండు ముదుసలి వరకు.. ఎవరూ వీటి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ప్రముఖంగా ఒక వాదన ముందుకు వస్తుంది. ఆడవారి వస్త్రధారణ వలనే వారిపై అత్యాచారాలు జరుగుతున్నవని వాదించేవారు చాలామంది.

మహిళల వస్త్రధారణపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రోజురోజుకూ మహిళలపై పెరిగిపోతున్న హింసకు వారి దుస్తులనే కారణంగా చూపిస్తున్నారు. అత్యాచారాలకు మహిళల వస్రాధారణ కారణమని చెప్పేవారికి బాంబే హైకోర్టు ఓ సంచనల తీర్పునిచ్చింది. రిసార్టుల్లో పొట్టి దుస్తులు వేసుకొని, రెచ్చగొట్టే విధంగా డాన్స్ లు చేయడాన్ని అశ్లీలతగా భావించలేమని బాంబే హైకోర్టు తెలిపింది. పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన వారిని అశ్లీలతగా పరిగణించలేమని బెంచ్ ఓ కేసులో తీర్పునిచ్చింది.

నాగ్‌పూర్ బెంచ్..

ఈ వివరాల్లోకి వెళితే… నాగపూర్‌లోని రెండు రిసార్ట్‌లపై మేలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు మహిళలు పొట్టి స్కర్ట్ లు వేసుకుని డాన్సులు చేస్తుండడం కనిపించింది. అక్కడ ఉన్న కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో తూగుతూ కనిపించారు. ఆ రిసార్టులపై దాడులకు దిగిన పోలీసులు వీటిని చూసి అశ్లీలతగా పరిగణించారు. అక్కడున్న అమ్మాయిల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కేసు హైకోర్టులోని నాగపూర్ బెంచ్ కు వెళ్లింది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం మహిళలు పొట్టి బట్టలు వేసుకుని, రిసార్టులో డాన్సులు చేయడం అశ్లీలతగా పరిగణించలేమని తెలిపింది.

జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, పబ్లిక్ ప్లేస్‌లలో ఇలాంటివి జరిగితే నేరంగా పరిగణించవచ్చు కానీ, ఇలాంటి ప్రాంతాల్లో జరిగిన అది నేరంగా తీసుకోలేమని నాగపూర్ బెంచ్ తెలిపింది. రిసార్టులు, అందులో ఉన్న బంకెట్ హాల్‌లు పబ్లిక్ ప్లేసులు కావని వీటిపైనా కేసులు ఎలా నమోదు చేస్తారని చెప్పింది. ఇలాంటి రిసార్టులు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చుట్టుపక్కల ఉన్నవారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయొచ్చని బెంచ్ తీర్పునిచ్చింది. అంతేకానీ ఎవరు ఫిర్యాదు చేయకుండా ప్రైవేట్ ఫంక్షన్ ల మీద పోలీసులు కేసులు పెట్టలేరని స్పష్టం చేస్తూ ఈ కేసును కొట్టివేసింది.

YES9 TV