జోగి రమేశ్‌కు ఊహించని షాక్: బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ పిటిషన్!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ మద్యం కేసులో ఆయనకు ఇటీవల లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విజయవాడ ఎక్సైజ్ కోర్టును ఆశ్రయించింది. జోగి రమేశ్ బయట ఉంటే కేసులోని కీలక సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అలాగే సాక్షులను భయభ్రాంతులకు గురిచేసే ప్రమాదం ఉందని సిట్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది.

83 రోజుల జైలు జీవితం తర్వాత మళ్లీ చిక్కులు

నకిలీ మద్యం తయారీ, అక్రమ విక్రయాల ఆరోపణలతో జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సుమారు 83 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న వీరికి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి విడుదలైన కొద్ది రోజుల్లోనే దర్యాప్తు సంస్థ మళ్లీ ఆయన బెయిల్ రద్దు కోరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

రాజకీయ ఉద్రిక్తతలు – దాడుల నేపథ్యం

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జోగి రమేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లపై చేసిన విమర్శలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదవ్వగా, రెచ్చగొట్టేలా మాట్లాడారన్న నెపంతో జోగి రమేశ్‌పై కూడా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వరుస పరిణామాల మధ్య సిట్ వేసిన పిటిషన్ ఆయనకు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

Posted Under AP
Editor