Latest Posts

`ఆమె` నుంచి చంద్రబాబుకు ప్రాణహాని..?

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. డజనుకు పైగా సూట్‌కేస్ కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే విషయం దర్యాప్తులో తేలడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దీని తరువాత పలు కేసులు చంద్రబాబును చుట్టుముట్టాయి. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ఆయనపై కేసు నమోదైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం-వాహనాలు తగులబెట్టిన ఘటనలోనూ కేసులు ఫైల్ అయ్యాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారం కూడా చంద్రబాబును వెంటాడుతోంది.

సీఐడీ ఎంక్వైరీలో నారా లోకేష్ కుడి భుజం- గుట్లు మట్లపై కూపీ..?!

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం అందుతోన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనకు ప్రతి రోజూ ఇంటి నుంచి భోజనాన్ని పంపిస్తోన్నారు. ములాఖత్ కూడా అవుతున్నారు.

దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఆయన భార్య నారా భువనేశ్వరి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు చంపాల్సిన అవసరం ఆమెకే ఉందని అన్నారు. నారా లోకేష్‌కు పదవీకాంక్ష పట్టుకుందని, ఈ నేపథ్యంలో కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి భువనేశ్వరి.. భర్త చంద్రబాబుకు అన్నంలో ఏమైనా కలిపి చంపే ప్రయత్నం చేయొచ్చని విమర్శించారు.

చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటూ భవనేశ్వరి చెప్పడాన్ని నారాయణ స్వామి తప్పుపట్టారు. ఆమె డాక్టరా? అంటూ ప్రశ్నించారు. తాను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్ బొమ్మ లేకుండా ఎన్నికల్లో గెలిచే దమ్ము చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటం వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా నారాయణ స్వామి విమర్శలు చేశారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారనేది అర్థం కావట్లేదని చురకలు అంటించారు. చంద్రబాబును కాపాడుకోవాలనే తపన తప్ప పార్టీని అభివృద్ధి పర్చడానికి పురంధేశ్వరి ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదని అన్నారు.

YES9 TV