T Congress లో ఎన్నికల రగడ, టార్గెట్ రేవంత్ – కేసీఆర్ కు అస్త్రంగా..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల పంచాయితీలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ 55 మంది అభ్యర్దుల జాబితా ప్రకటించింది. అందులో సీట్లు ఆశించిన వారు టికెట్లు దక్కక నిరసనలకు దిగుతున్నారు.

ఇదే సమయంలో మాజీ ఎంపీలు సైతం సీట్లు ఆశించారు. తుది జాబితా కోసం నిరీక్షిస్తూనే..పరిణామాలను గమనిస్తున్నారు. అభ్యర్దుల ఖరారు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి..తమను పట్టించుకోకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

టికెట్ పంచాయితీలు

తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ పంచాయితీలు తారా స్థాయికి చేరుతున్నాయి. కాంగ్రెస్ లో ఈ సారి ఇటువంటి సమస్యలు రాకుండా నివారించేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పలువురు సీనియర్లతో కమిటీలు ఏర్పాటు చేసింది. అనేక వడపోతల తరువాత అభ్యర్దులను ఖరారు చేస్తోంది. అందులో భాగంగా 55 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది.

సీట్లు రాని వారు నిరసనలకు దిగుతున్నారు. అందులో ప్రధానంగా టీపీసీసీ చీప్ రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. అటు పార్టీ సీనియర్లుగా ఉన్న మాజీ ఎంపీలు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ నివాసంలో భేటీ అయ్యారు. తమకు ఎవరికీ సీట్లు రాకపోవటం పైన చర్చించారు. తుది జాబితాలో అవకాశం ఉంటుందేమో వేచి చూద్దామనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మాజీ ఎంపీల సమావేశం

అయితే, తుది జాబితా ప్రకటించిన తరువాత చేసేది ఏమీ ఉండదనే అభిప్రాయం నేల మధ్య వ్యక్తం అయింది. మాజీ ఎంపీలు యాష్కీ, బలరాం నాయక్, రాజయ్య, సురేష్ షట్కర్ భేటీ అయ్యారు. ఇందులో యాష్కీ ఈ సారి ఎల్బీ నగర్ నుంచి సీటు ఆశించారు. మిగిలిన ఎంపీలు పోటీ చేయాలని భావించారు. మాజీ ఎంపీ పొన్నం హుస్నాబాద్ సీటు ఆశించారు.

కానీ, వీరిలో ఎవరికీ తొలి జాబితాలో సీటు దక్కలేదు. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖరారు చేసి తమకు కేటాయించకపోవటం పై వీరంతా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, వీరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ నాయకత్వంతో సమావేశం కావాలని నిర్ణయించారు. తొలి జాబితాలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ముషీరాబాద్ సీటు కేటాచించారు.

సీట్లు దక్కని వారి నిరసనలు

సీట్లు దక్కని ఆశావాహులు నిరసనలు కొనసాగిస్తున్నారు. 10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఆందోళనకు దిగారు. అదే విధంగా మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కేటాయించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముందు కార్యకర్తలు నిరసన కు దిగారు.

సర్వేల ఆధారంగా హరివర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేసారు. అటు రేవంత్ లక్ష్యంగా ఇప్పటికే ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్న పరిణామాలు..తుది జాబితా తరువాత కంటిన్యూ అయితే, ఇది కేసీఆర్ కు అస్త్రంగా మారుతుందనే అందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.

YES9 TV