ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి బేషరతుగా మద్దతు

ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన కేంద్రం .. అనంతరం స్వదేశంలో విమర్శలతో కాస్త వెనక్కి తగ్గింది. పశ్చిమాసియాలో శాంతిని కోరుకుంటున్నామని, స్వతంత్ర పాలస్తీనాకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ వ్యవహారాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించింది.

ఈ నేపధ్యంలో ఇవాళ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిజోరంలో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీని ఇదే అంశంపై టార్గెట్ చేశారు.

ప్రధాని మోడీకి పొరుగున ఉన్న మరో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అల్లర్లు జరుగుతుంటే దాని కంటే ఇజ్రాయెల్ ముఖ్యమైపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ కంటే ఇజ్రాయెల్ పైనే ప్రధాని మోడీకి ప్రేమ ఎక్కువంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో స్ధానిక సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు రాహుల్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ విషయంలో కేంద్రం స్పందన తర్వాత రాహుల్ తో పాటు పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

ఓ పక్కన మణిపూర్ లో హింస ప్రజర్విల్లుతుంటే.. ప్రధాని మోడీకి మాత్రం ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆసక్తిగా ఉందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఉన్న మిజోరంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉందన్నారు. కానీ మణిపూర్‌లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ప్రధాని మోడీ ఇప్పటిపరకూ పర్యటించకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంది.

రాహుల్ గాంధీ జూన్‌లో తన మణిపూర్ పర్యటనను కూడా ప్రస్తావిస్తూ.. తాను చూసిన వాటిని నమ్మలేకపోతున్నానని అన్నారు. మణిపూర్ ఆలోచనను బీజేపీ నాశనం చేసిందన్నారు. ఇది ఇకపై రాష్ట్రం కాదని, ఇప్పుడు రెండు రాష్ట్రాలని మెయిటీ, కుకీ తెగల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ప్రజలు హత్యకు గురయ్యారని,మహిళలు వేధింపులకు గురయ్యారని, పసికందులను చంపారని, కానీ ప్రధానికి అక్కడ పర్యటించడం ముఖ్యం కాదని రాహుల్ ఎద్దేవా చేశారు.

YES9 TV