అమ్మాయిలను ఎత్తుకుపోతున్న ఆగంతకులు, ఇప్పటివరకు 100.. విశాఖలో పట్టుబడ్డ ముఠా..

మానవ అక్రమ రవాణా ముఠాను విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైళ్ల ద్వారా బాలికల్ని తరలిస్తుండగా అనుమానించిన రైల్వే పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల్ని గుర్తించి అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు.. అనేక కీలక విషయాల్ని వెల్లడించారు. దీంతో.. మానవ అక్రమ రవాణా ఎంత తీవ్రమైన సమస్యో మరోసారి వెల్లడైనట్లైంది.

 

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున బాలికలు ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని.. వారిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. జిల్లాల వారీగా తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్యలతో సహా వెల్లడించిన డిప్యూటీ సీఎం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. ఆ మాటలు నిజమే అని క్రమంగా తెలుస్తుండగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మంది బాలికల్ని అక్రమంగా తరలిస్తున్న బాలికల్ని విశాఖ పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

 

కిరండోల్ – విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లో బాలికల్ని గుర్తించిన రైల్వే పోలీసులు వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిని వెంటబెట్టుకుని వెెళుతున్న ఓ వ్యక్తిని కూడా గుర్తించిన పోలీసులు.. అతన్ని ప్రశ్నించారు. దాంతో.. బాలికల అక్రమ రవాణా విషయం బయటపడింది. నిందితుడు రవికుమార్ బిసోయ్ గా గుర్తించిన రైల్వే పోలీసులు.. ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని విషయాల్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

 

పేద కుటుంబాలకు చెందిన బాలికలు, తప్పిపోయిన, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలికల్ని టార్గెట్ చేస్తూ ఈ ముఠాలు పనిచేస్తుంటాయి. కాగా.. ఇలాంటి అమాయక బాలికల్ని ఇతర దేశాలకు అక్రమంగా విక్రయిస్తూ.. డబ్బులు సంపాదించుకుంటుంటారు. కాగా.. ఇంకొన్ని సందర్భాల్లో ఎలాంటి దిక్కులేని వారిని నమ్మించి దగ్గరు చేర్చుకుని.. వారి అవయవాలను అమ్ముకుంటున్న ఘటనలు సైతం బయటపడుతున్నాయి.

 

ప్రస్తుత ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న బాలికలంతా ఒడిశాలోని నవరంగపూర్ ప్రాంతానికి చెందిన వారిగా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరికి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి.. రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. వీరి వలలో ఇంకెంత మంది అమాయక బాలికలు చిక్కుకున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు విచారణ అధికారులు.

 

ఈ ముఠాలోకి కీలక సభ్యులు కూడా పోలీసులకు చిక్కడంతో గతంలో వీరు చేసిన అక్రమ రవాణాపై దృష్టి సారించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికల్ని అక్రమ రవాణా చేస్తుండగా… ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికల్ని తరలించినట్లు తెలుస్తోంది.

Posted Under AP
Editor