తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ -రేస్ కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసు విచారించేందుకు ఏసీబీలో ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్ట్రేషన్ యూనిటీ-(సీఐయు) ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పని చేయనుంది సీఐయు.
కేసు దర్యాప్తు ఏ మాత్రం బయటకు తెలీకుండా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరుపబోతోంది. కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించునున్నారు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకోనుంది ఏసీబీ ప్రత్యేక టీమ్. ఎస్ఎక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాలపై పరిశీలించనుంది.
రేపోమాపో కేటీఆర్ తోపాటు మరో ఇద్దరు అధికారులకు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. ఈ కేసుకు సంబంధించి తొలుత ఫైళ్లను, డిపార్టుమెంట్ ఎంక్వైరీలో సేకరించిన ఆధారాలను ప్రత్యేక టీమ్ తీసుకోనుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆయా వ్యక్తులను విచారించనుంది. వచ్చే వారం నుంచి ఈ కేసు దర్యాప్తు వేగవంతం కానున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నారు. అరెస్ట్ లేకుండా విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తోందట. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఓ లీగల్ టీమ్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నట్లు అంతర్గత సమాచారం.
ఇదిలావుండగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలని ఆలోచన చేస్తోంది కేటీఆర్ లీగల్ టీమ్. తనపై మోపిన సెక్షన్లను కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనుంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు కేటీఆర్.
ఏసీబీ కేసు నమోదు చేయగానే కేటీఆర్‌కు సంబంధించిన లీగల్ టీమ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను అప్రోచ్ అయ్యిందట. వారిచ్చిన సమాచారం ఆధారంగా గత రాత్రి కేటీఆర్ మీడియా ముందుకొచ్చారని అంటున్నారు. కేవలం అభివృద్ధి కోసమే తాను ఇదంతా చేశాను అనే విధంగా మాట్లాడాలని సూచన చేసిందట. రేపటి రోజున ఇదీ కూడా ఆధారంగా పనికొస్తుందని సలహా ఇచ్చినట్టు సమాచారం.