చైనాలో హాంగ్ఝౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో తెలుగు తేజం, విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజీ (Jyoti Yarraji) సంచలనం

విశాఖపట్నం: చైనాలో హాంగ్ఝౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో తెలుగు తేజం, విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజీ (Jyoti Yarraji) సంచలనం సృష్టించారు.

మెడల్‌తో మెరిశారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా చాటారు. ఈ విభాగంలో ఆమె రజత పతకాన్ని ముద్దాడారు.

లోకల్ అథ్లెట్ వు యాన్నీ డిస్‌క్వాలిఫై కావడంతో పతకం జ్యోతి యర్రాజీని వరించింది. తొలుత రేస్ మొదలవడానికి క్షణం ముందే పరుగు ప్రారంభించినట్లు నిర్ధారణ అయింది. ట్రాక్‌పై జ్యోతికి ఎడమ వైపున ఉన్న యాన్నీ అందరికంటే ముందుగా పరుగును ప్రారంభించడం రీప్లేలో స్పష్టంగా కనిపించింది. యాన్నీ పరుగు మొదలుపెట్టిన సెకెండ్ల వ్యవధిలో జ్యోతి యర్రాజీ ట్రాక్‌పైకి రావడం రికార్డయింది.

రేసు ప్రారంభం కాకముందే యాన్నీ పరుగు మొదలుపెట్టడం వల్ల ఫాల్స్ స్టార్ట్‌గా ప్రకటించారు న్యాయనిర్ణేతలు. మొదట వాళ్లిద్దరినీ రేసు నుంచి తప్పించాలని భావించారు. దీనికి జ్యోతి అంగీకరించలేదు. నిర్వాహకులతో చర్చించారు. తనది ఫాల్స్ స్టార్ట్ కాదంటూ వాదించారు. భారత అథ్లెట్ల టీమ్ ఆమెకు అండగా నిలిచింది.

సుదీర్ఘ చర్చల, రివ్యూలు, రిప్లేల తరువాత రేసులో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. రేసు మొదలైన వెంటనే స్లోగా పరుగు మొదలు పెట్టిన జ్యోతి ఆ తరువాత వేగం పుంజుకున్నారు. 12.91 సెకెన్ల వ్యవధిలో రేసును పూర్తి చేసి, మూడో స్థానంలో నిలిచారు. దీనితో ఆమెకు రజతం పతకం ఖాయమైంది. అప్పటికి ఫాల్స్ స్టార్ట్ వీడియో రివ్యూ పూర్తి కాకపోవడం వల్ల అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు.

వీడియో రివ్యూ తరువాత యాన్నీది ఫాల్స్ స్టార్ట్ తేల్చారు నిర్వాహకులు. ఫలితంగా ఆమెపై అనర్హత వేటు పడింది. టీఆర్16.8 నిబంధనల ప్రకారం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇలా వు నిష్క్రమించడంతో జ్యోతి రెండో స్థానంలో రేసు ముగించినట్లు అయింది. ఈ క్రమంలో జ్యోతి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని భావించిన అధికారులు.. ఆమె రేసు ఫలితాన్ని గుర్తించారు.

ఆమెను రజత పతకంతో సత్కరించారు. తన కుమార్తె జ్యోతి పతకం సాధించడంతో విశాఖపట్నం (Visakhapatnam)లో నివాసం ఉంటోన్న ఆమె కుటుంబంలో సంతోషాలు వెల్లివిరాశాయి. తండ్రి సూర్యనారాయణ (Suryanarayana) భావోద్వేగానికి గురయ్యారు. టీవీ చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోన్నారు. తల్లి పేరు కుమారి. ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనర్‌గా పని చేస్తోన్నారు.

వైజాగ్ పోర్ట్ హైస్కూల్ కృష్ణాలో చదువుకున్నారు జ్యోతి యర్రాజీ. అనంతరం ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బీఏ హిస్టరీ చేశారు. తొలిసారిగా 2015లో ఏపీలో నిర్వహించిన అంతర్‌ జిల్లా అథ్లెట్ మీట్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అనంతరం హైదరాబాద్ సాయ్ సెంటర్‌లో శిక్షణ పొందారు.

YES9 TV