తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి: మొన్నటికి మొన్న తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు.

చివరి రోజున పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కిందటి నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడ సేవ నాడు 72,650 మంది తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మొత్తం 30.22 లక్షల లడ్డూలను విక్రయించారు టీటీడీ అధికారులు. రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా అందుబాటులో ఉంచారు. ఈ ఎనిమిది రోజుల్లో హుండీ ద్వారా 24.22 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

ఇప్పుడు మళ్లీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇదివరకే నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు.

దీనితో పాటు నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. అక్టోబర్ 3వ తేదీన- మధ్యాష్టమిని నిర్వహించనున్నారు. 10వ తేదీన మతత్రయ ఏకాదశి, 13న మాస శివరాత్రి పండగలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

14వ తేదీన మహాలయ అమావాస్య పండగను జరుపుతారు. అదే రోజున రాత్రి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. వేదాంత దేశిక ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయి. 19వ తేదీన గరుడ సేవ, 20వ తేదీన పుష్పక విమానం, సరస్వతి పూజ ఉంటుంది.

21వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, 23న చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం పండగలను వైభవంగా నిర్వహిస్తారు.

24న పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25న మతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం షెడ్యూల్ చేశారు. 28వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం సంప్రోక్షణ కార్యక్రమంతో ఆ దేవదేవుడి ఆలయ వాకిళ్లను తెరుస్తారు. 31వ తేదీన చంద్రోదయో వ్రతం ఉంటుంది.

Posted Under AP
YES9 TV