రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇఫ్తార్ విందు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాదీ మహల్‌లో పట్టణ ముస్లిం సోదరులకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముస్లిం సోదరులు ధరించే సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక నమాజు, దువా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డిస్తూ వారికి ఆతిథ్యం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడానికి అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తూ ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రేమతో, అభిమానంతో ఆశీర్వదిస్తున్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతగా ఈ చిన్న దావత్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో చేసే ప్రార్థనలు వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ తమ పిల్లలతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని మనస్పూర్తిగా అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ప్రేమ, కరుణ, శాంతి, సహనం, దాతృత్వం వంటి విలువలను ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రతిబింబిస్తుందని చెప్పారు. సమాజంలోని ప్రతి ముస్లిం నియమ నిష్టలతో 30 రోజులపాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడపడం స్పూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం పెద్దలు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor