టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. జైలులో చంద్రబాబును కలిసిన పవన్ బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు.
అప్పటి నుంచి పవన్(Pawan Kalyan) పాత్ర కీలకంగా మారింది. అయితే, చంద్రబాబు జైలులో ఉండటంలో ఆ సమయంలో బాధ్యతలు తీసుకోవాల్సిన లోకే(Lokesh)శ్ ఎందుకు వెనుకడుగు వేసారు. ఢిల్లీ(Delhi)లో ఏం చేస్తున్నారు. వచ్చిన అవకాశం వదులుకున్నారా..ఇది భవిష్యత్ లో పార్టీకి నష్టంగా మారనుందా. ఇదే చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మొదలైంది.
పొత్తులతో కొత్త లెక్క
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నారా భువనేశ్వరి(Bhuvaneswari), బ్రాహ్మణి(Brahmani) రాజమండ్రిలోనే ఉంటున్నారు. జైలులో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్, నందమూరి బాలయ్, పార్టీ నేతలు కలిసారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసిన పవన్ బీజేపీ(BJP)కి దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర(Varahi Yatra)లో పాల్గొనాలని పార్టీ నేతలకు బాలయ్య(Balakrishna), లోకేశ్(Lokesh) పిలుపునిచ్చారు. కానీ, రెండు పార్టీల కేడర్ కలిసినట్లుగా అవనిగడ్డ సభలో కనిపించలేదనే వాదన ఉంది. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ల వైఖరి పైన చర్చ మొదలైంది. చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన సీనియర్లలో కొందరు సంబంధం లేనట్లుగా వ్యవహరించటం పార్టీ శ్రేణులకు రుచించటం లేదు.
ఢిల్లీలోనే లోకేశ్
చంద్రబాబు అరెస్ట్ తో తన యాత్ర రద్దు చేసుకొని విజయవాడకు వచ్చిన లోకేశ్.. చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లిన తరువాత మూడు రోజుల వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు. పార్టీ సమావేశాలకు జూమ్ ద్వారా హాజరవుతున్నారు. నిర్ణయించిన నిరసనలు ఢిల్లీలోనే చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత పార్టీలో ముఖ్య నేతగా..అందుబాటులో ఉంటూ పార్టీ కేడర్ కు భరోసా ఇవ్వాల్సిన లోకేశ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే చర్చ మొదలైంది. న్యాయపరమైన అంశాలు చర్చించేందుకు అని చెబుతున్నా..అందుకు ఇన్ని రోజులు అవసరమా అనేది మరో ప్రశ్న వినిపిస్తోంది. కేసుల కారణంగానే లోకేశ్ ఢిల్లీలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఢిల్లీలోనే నోటీసులు తీసుకున్న లోకేశ్..హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు.
పవన్ వైపు చూపులు
ఎన్నికలకు సిద్దం అయ్యే వేళ యువగళం యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న లోకేశ్..ఈ సమయంలో ఢిల్లీకి పరిమితం కావటం బిగ్ బిస్టేక్ గా పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఏపీలోనే ఉంటూ వాటిని ఎదుర్కోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో పవన్ మద్దతు పార్టీకి అవసరంగా మారింది. పవన్ వారాహి యాత్ర ద్వారా వైసీపీని టార్గెట్ చేస్తుంటే..లోకేశ్ ఢిల్లీలో ఉంటూ మీడియా సమావేశాలకు పరిమితం కావటం ఏంటనే చర్చ వినిపిస్తోంది. పార్టీకి భవిష్యత్ నేతగా నిరూపించుకోవాల్సిన సమయంలో లోకేశ్ వ్యూహాత్మక తప్పిదం చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే ఇప్పుడు పవన్ కు అనుకూలంగా మారిందనే విశ్లేషణలు మొదలయ్యాయి.