Latest Posts

కొవిడ్-19 కొత్త వేరియంట్ “ఆర్క్‌చురస్”.. విభిన్నమైన లక్షణాలు!

కొవిడ్-19 కొత్త వేరియంట్‍పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organizatio – WHO) దృష్టి సారించింది. ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‍ఓ కనుగొంది.

ఈ కొవిడ్ కొత్త వేరియంట్‍ను ఆర్క్‌చురస్ (Arcturus)గా పిలుస్తోంది. ఇది XBB.1.16 సబ్ వేరియంట్‍గా ఉంది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ వేరియంట్ వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

వ్యాప్తి ఎక్కువ

COVID New variant Arcturus: “నిశితంగా పరిశీలిస్తున్న వేరియంట్”గా XBB.1.16ను మార్చి నెలాఖరులో డబ్ల్యూహెచ్‍వో ప్రకటించింది. దీని వ్యాప్తి వేగంగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పక సమీక్షించాల్సిన వేరియంట్‍గా XBB.1.16 ఉందని WHO కొవిడ్ టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ అభిప్రాయపడ్డారు.

ఈ వేరియంట్ లక్షణాలు ఇవే

COVID New variant Arcturus: కాగా, ఈ ఆర్క్‌చురస్ (XBB.1.16) వేరియంట్ లక్షణాల గురించి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాజీ హెడ్ డాక్టర్ రిపిన్ విశిష్ఠ వెల్లడించారు. ఈ వేరియంట్ సోకిన వారిలో “అధిక జ్వరం, దగ్గు, కళ్లు దురదగా ఉండి ఎర్రబడడం లేదా కండ్లకలక లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ వేరియంట్‍లో కళ్లకు సంబంధించి లక్షణాలు విభిన్నంగా ఉన్నాయి.

కరోనా వైరస్ లక్షణాలు పూర్తిగా మారుతున్నాయని ఇప్పుడే చెప్పలేమని ఆర్టీఐ ఇంటర్నేషనల్ ఇన్ఫెక్షువస్ డిసీజ్ ఎపిడెమియాలజిస్ట్ రిచర్డ్ రీటన్‍గేర్ చెప్పారు.

ఇండియాలో పెరుగుతున్న కేసులు

Covid-19 Cases in India: భారత్‍లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే దేశంలో 7,830 కొవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. డైలీ కేసుల పరంగా ఇది 223 రోజుల గరిష్టంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది అయితే, కరోనాతో ఆసుపత్రుల్లో చేరడం మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఇండియాలోనూ కొన్ని XBB.1.16 కేసులు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా కారణంగా 16 మంది చనిపోయినట్టు ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 5,31,016కు చేరింది.

దేశంలో ఇప్పటి వరకు ప్రజలకు 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‍ మళ్లీ వేగవంతం అయ్యేలా కనిపిస్తోంది. బూస్టర్ డోసులు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

YES9 TV