నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన చేసింది. 1,392 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ నెల 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. గడువు తేదీ వచ్చే ఏడాది జనవరి 6వ తేదీ వరకు ఉండగా.. దాన్ని జనవరి 10వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది. జూన్‌, జులైలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర టీఎస్‌పీఎస్‌సీ రెడీ అయింది. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆరంభం అవుతుందని ముందుగా ప్రకటించగా.. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది.

నిరుద్యోగులు గమనించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. 1392 పోస్టులలో అత్యధికంగా గణితంలో 154, ఇంగ్లిష్ 153, హిందీ 117, జువాలజీ 128, ఫిజిక్స్ 112, కెమిస్ట్రీ 113 జూనియర్ లెక్చరర్ల పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేయనుంది. వీటితో పాటు ఇతర విభాగాల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేఫన్ ఇచ్చింది. అర్హత గల అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఈ నెల 20వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించండి. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద 200 రూపాయలు, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే.. పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తుండగా.. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు మార్కు కేటాయించారు. అదేవిధంగా పేపర్-2కి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం ఉంటుంంది. పేపర్-1 ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, తెలుగులో ఉంటుండగా.. పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుందని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Editor