ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అరటి ధర హాట్ టాపిక్‌గా మారింది. అరటి రైతుల సమస్యలపై అధికార కూటమి మరియు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రోజున ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతున్నాయని విమర్శించారు. కూటమి పాలనలో అరటితో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, రైతులు కష్టాల్లో ఉంటే ఉచిత పంట బీమా, సబ్సిడీలు వంటివి లేవని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ హయాంలో టన్ను అరటి రూ. 25,000 ఉండేదని ఆయన గుర్తు చేశారు.
అయితే, వైఎస్ జగన్ చేసిన ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ఖండించింది. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనంటూ జగన్ చెప్పడం పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో అరటి టన్నుకు నమోదైన ధరల వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా, గత వారం రోజులుగా అరటి మెట్రిక్ టన్నుకు రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు పెరిగిందని, డిసెంబర్ రెండో వారం నుంచి ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం సూచించింది. రైతులను నిరాశకు గురిచేసేలా అపోహలను నమ్మవద్దని కోరింది.
