బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ‘కాంతార’ సినిమాపై ప్రశంసలు తెలిపే క్రమంలో చేసిన వ్యాఖ్యలు మరియు దైవం ఆవహించిన సన్నివేశాన్ని అనుకరించడంపై వివాదంలో చిక్కుకున్నారు. గోవాలో జరిగిన ఇఫీ (IFFI) వేదికగా రిషబ్ శెట్టి నటనను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు, ముఖ్యంగా హిందూ జనజాగృతి సమితి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో, రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ క్షమాపణలు తెలిపారు. “ఈ సినిమాలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఆ ప్రత్యేక సన్నివేశాన్ని అదే విధంగా ప్రదర్శించడడం ఎంత కష్టమో ఒక నటుడిగా నాకు తెలుసు” అని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను గాయపరిచి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే, ఇఫీ వేడుకలకు హోస్టుగా వ్యవహరించిన రణ్‌వీర్ సింగ్, ‘కాంతార 2’ క్లైమాక్స్‌లో హీరో పాత్రలోకి ఆడ దెయ్యం ప్రవేశించినప్పుడు వచ్చే సీన్స్ చాలా బాగున్నాయంటూ మెల్ల కన్ను పెట్టి, ‘ఓ’ అంటూ సౌండ్ చేస్తూ ఆ సన్నివేశాన్ని అనుకరించారు. కన్నడ విశ్వాసాలను కించపరిచే విధంగా ఆయన వ్యవహరించారని, ఆ సన్నివేశాన్ని కామెడీగా అనుకరించడం అవమానకరమని కన్నడిగులు మరియు హిందు జనజాగృతి సమితి ఆరోపించారు.
