టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు కోహ్లీ నిరాకరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనపై కోచ్ గంభీర్ మరియు సెలక్టర్లు మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు. అయితే, రోహిత్ శర్మ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని స్పష్టం చేసినప్పటికీ, కోహ్లీ మాత్రం పాల్గొనేందుకు విముఖత చూపుతున్నాడు. “ఒకే నిబంధన అందరికీ వర్తిస్తుంది. ఒక ఆటగాడికి మినహాయింపు ఎలా ఇస్తాం?” అని బీసీసీఐ వర్గాలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, తాను ఎక్కువ ప్రిపరేషన్‌ను నమ్మనని, తన క్రికెట్ అంతా మానసికమైనదని కోహ్లీ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీ-గంభీర్ మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనున్న రాయ్‌పూర్‌కు జాతీయ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాను పంపి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
