Latest Posts

కొండపై ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. క్వారీల్లో తవ్వకాలకు బ్రేక్..

 

బొమ్మనహాళ్, జూలై 21:
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఓ ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి వెళ్లిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు మార్గం లేక శిఖరంపై ఇరుక్కుపోయినట్లు సమాచారం.
క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఎలుగుబంటి భయాందోళనలకు గురికాకుండా, సురక్షితంగా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఎలుగుబంటికి ఎలాంటి హాని జరగకుండా అడవిలోకి సురక్షితంగా పంపించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Posted Under AP
Editor