సత్యసాయి వాటర్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు

ముదిగుబ్బ, సత్యసాయి వాటర్ సప్లై వర్కర్లు సమ్మెలోకి వెళ్లడంతో పలు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నకోట్ల, బుధనాంపల్లి, కొడవండ్లపల్లి, బండ్లపల్లి, ఈధులపల్లి, మర్తాడు , ఇందుకూరు, దొరిగల్లు, నాగాలాగుబ్బల, ముదిగుబ్బతో పాటు పలు గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా మారింది.

వర్షాలు లేకపోవడంతో చెరువులు, ఏరులు, వంకలు, వాగుల్లో నీరు లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలతో పాటు పశువులు, మేకలు, గొర్రెలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ఆయా గ్రామాల్లోని పంచాయతీల పరిధిలో అనేక బోర్లు, బోరు మోటార్లు, చేతిపంపులు, కుళాయిలు పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

సత్యసాయి వాటర్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ సంబంధిత అధికారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి పాడుబడిన బోర్లు, బోరు మోటార్లు, చేతిపంపులు, కుళాయిలను మరమ్మతులు చేయడంతో పాటు ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Posted Under AP
Editor