కర్నూలు జిల్లా ఆలూరులో మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఉద్యోగ భద్రతతో పాటు రూ.35 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులకు వినతిపత్రం అందజేశారు.
వాయిస్ ఓవర్:
కర్నూలు జిల్లా ఆలూరు డివిజన్‌లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (MPEOలు) తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఆలూరులోని సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహించారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు చెంగల్రాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ ఆందోళనకు సీపీఐ, సీపీఎం నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీఈవో నాయకులు విశాలాక్ష్మి, జయకుమార్‌తో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు భూపేష్, హనుమంతు, నారాయణస్వామి మాట్లాడుతూ… గత 12 సంవత్సరాలుగా వ్యవసాయశాఖలో సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది జారీ కావాల్సిన సర్వీస్ రెన్యూవల్ ఉత్తర్వులు ఆలస్యమవుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటికీ విడుదల కాలేదన్నారు. ఐదు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ జీతాలను విడుదల చేసి, సీఎఫ్‌ఎంఎస్ ద్వారా సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నాన్-శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
సమాన పనికి సమాన వేతనం సూత్రం ప్రకారం నెలకు రూ.35 వేల వేతనం అమలు చేయాలని, హెల్త్ కార్డులు, గ్రాట్యుటీ లేదా ఎక్స్‌గ్రేషియా, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, పలువురు ఎంపీఈవోలు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
