పేద పిల్లల ఆకలి మీద అహంకారపు దాడి – గరికపాటి వ్యాఖ్యలు ఖండించండి!
పద్మశ్రీ నీ రద్దు చెయ్యాలి – AISA
ఉరవకొండ పట్టణంలో శనివారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఏ. ఐ. ఎస్. ఏ ) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు భీమేష్ మాట్లాడుతూ…… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావు; అవి వర్గపక్షపాతం, దోపిడీ వ్యవస్థను సమర్థించే శ్రేణి మానసికతకు ప్రతిబింబం. ఆకలి, అక్షరం మధ్య ఉన్న జీవన సంబంధాన్ని అర్థం చేసుకోలేని వర్గ దురహంకారం ఆ వ్యాఖ్యల్లో స్పష్టంగా బయటపడింది.
మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, కోడిగుడ్డు వంటి అంశాలు “సహాయం” కాదు – ఇవి శ్రమజీవుల పిల్లలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు. శతాబ్దాలుగా సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీ కారణంగా పేద కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్న పరిస్థితుల్లో, ఈ పథకాలు వారి విద్యను నిలబెట్టే కనీస భరోసా. ఈ హక్కులను హేళన చేయడం అంటే పేదలపై దాడి చేయడమే.
“విద్యార్థులు కోడిగుడ్డు కోసం వస్తున్నారా?” అనే ప్రశ్న వర్గ ద్వేషంతో నిండినది. పౌష్టికాహార లోపం వల్ల బాధపడుతున్న లక్షలాది పిల్లల వాస్తవాలను అవమానించే ఈ వ్యాఖ్యలు అమానుషం. ఆకలి కడుపుతో అక్షరం నిలవదని తెలిసినా తెలియనట్టుగా మాట్లాడడం, దోపిడీ వర్గాల మానసిక దౌర్జన్యాన్ని చూపిస్తుంది.
గ్రామీణ, దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు తమ పిల్లలు చదువుకుని దోపిడీ గొలుసులను చెరిపేయాలని ఆశతో ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నాయి. అలాంటి పిల్లల ఆకలిపై విషం కక్కడం, వారి విద్యా హక్కులను అవమానించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
శ్రమజీవుల హక్కులను, వారి పిల్లల భవిష్యత్తును తక్కువ చేసి మాట్లాడే మేధావితనం సమాజానికి ప్రమాదకరం. ఇటువంటి వర్గపక్షపాత, అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే వారికి గౌరవాలు ఇవ్వడం కూడా సమాజానికి అవమానం.
గరికపాటి తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
పేదలపై ద్వేషాన్ని ప్రోత్సహించే వ్యక్తికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమలకు శ్రీకారం చూడతం అని తెలిపారు.
