Latest Posts

ఘనంగా రంజాన్ వేడుకలు…

 

పెనుమూరు, మార్చి 21:

ముస్లిం సోదరులు ఈద్- ఉల్- ఫితర్ పర్వదినాన్ని శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం పిల్లలు పెద్దలు తలంటి స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి, ఈద్గాలు, మసీదులకు వెళ్లి పేష్ ఇమామ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమూరు నూరానీ మసీదు, పూనే పల్లి, రేణుక నగర్ కాలనీ లోని ముస్లిం సోదరులు మసీదు నుండి ఈద్గా వద్ద కు ఐక్యమత్యంతో పురవీధుల్లో ర్యాలీగా వెళ్లారు. అక్కడ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. సందర్భంగా మత గురువు మాట్లాడుతూ సర్వ మానవ సమానత్వాన్ని, ప్రేమాభిమానాలను పెంపొందించేదే రంజాన్ అన్నారు.ఈ మాసంలో ధనిక పేద తేడా లేకుండా రాగద్వేషాలు విడిచి సోదర భావంతో మెలగాలన్నారు. ఇస్లాం సర్వ మానవాళికి నూతన మార్గాన్ని, జీవన విధానాన్ని సూచిస్తుం దన్నారు. సర్వ మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన ఖురాన్ షరీఫ్ గ్రంథం ఈ మాసంలోనే అవతరించిందన్నారు. ప్రపంచంలో ఎన్ని జాతులు మతాలు ఉన్నప్పటికీ అందరూ సోదరాభావంతో మెలిగే ఏకైక దేశం మనదేనన్నారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నం అన్నారు. ముస్లిం క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనల కలయకే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందన్నారు. పేదల ఆకలి దప్పికలు సర్వ మానవాళికి తెలియజేయాలన్నదే రంజాన్ పర్వదినం ఉద్దేశం అన్నారు. ఖురాన్ షరీఫ్ బోధించిన ఉత్తమ జీవన సరళిని అనుసరిస్తూ పరమత సహనాన్ని కలిగి ఉండాలన్నారు. ఉపవాస దీక్షలు ఆకలి గొప్పతనాన్ని తెలియజేస్తాయని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం కష్టాల్లో ఉన్న వారికి తోచిన విధంగా సహాయం చేయాలన్నారు. ఈ మాసంలో ప్రతి దీక్షపరుడు దానధర్మాలకు పెద్దపీట వేయాలన్నారు.నెల రోజులపాటు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా కరుణ కటాక్షాలు పొందాలని లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ బీద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానిలో దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి,సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు.అల్లా ఇచ్చిన జీవితాన్ని పరమ పవిత్రంగా నిష్టగా గడుపుతూ పెద్దలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలన్నారు. ప్రవక్త బోధించిన బోధనలను తూచ తప్పకుండా పాటిస్తూ ఇస్లాం ధర్మాలను ఆచరిస్తూ దానధర్మాలు చేస్తూ పేదలను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హిందూ ముస్లిం, క్రైస్తవ సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్ ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు నూరాని మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్ మహబూబ్ భాషా, ఉపాధ్యక్షులు ఎస్ అల్తాఫ్ హుస్సేన్, మున్నా ఖాన్, జిక్రియ భాషా, గౌస్ భాష, ఆసిఫ్ ఇమ్రాన్, రఫీ, గఫూర్, ఈక్రమ్ కలవకుంట పంచాయతీ పూనే పల్లి, రేణుక నగర్ కాలనీ. దేవలంపేట, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor