తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి లక్షలు, కోట్లు వెచ్చించి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మూడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసినా ఒక్కరూ పోటీ చేయకపోవడంతో ఈ గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన కొనసాగే అవకాశం ఉంది. రిజర్వేషన్లు మార్చాలని, తమ గ్రామాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
గూడెం గ్రామం ఎన్నికలను బహిష్కరించడానికి ప్రధాన కారణం, తమ గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకున్నా, సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేయడమే. దీంతో సర్పంచ్ లేకుండా వార్డులు ఎందుకని భావించి, వార్డు స్థానాలకు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అదేవిధంగా, నెల్కి వెంకటాపూర్ గ్రామంలో కూడా ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్లను ఎస్టీలకు కేటాయించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ, దానిని జనరల్ కేటగిరీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో గ్రామం, వందూర్ గూడ గ్రామస్తులు తమ గ్రామాన్ని తిరిగి నెల్కి వెంకటాపూర్ గ్రామంలోనే విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఈ రెండు గ్రామాలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని గ్రామస్థులు వాదిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మోబిన్‌సాబ్ తండా పంచాయతీ ప్రజలు కూడా గత ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రొటేషన్ పద్ధతిలో ఇవ్వనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించారు.
