ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. వివరాల్లోకి వెళితే, కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హోటల్స్ నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకుని విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే, అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపులు ఆకతాయిల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుపతిలో ఇలా వరుసగా బెదిరింపులు రావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యాలయం, రైల్వే స్టేషన్‌కు కూడా ఇదే తరహాలో ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుస ఘటనల నేపథ్యంలో, ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు.
