ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుని మేయర్ పదవిని దక్కించుకున్న కూటమి.. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మాత్రం తడబాటు ప్రదర్శించింది. డిప్యూటీ మేయర్ గా ఏ పార్టీ కార్పోరేటర్ ఉండాలనే విషయంలో కూటమి పార్టీల మధ్య తలెత్తిన విభేదాలతో ఇవాళ కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
విశాఖ నగర పాలక సంస్ధలో డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడ్డారు. అయితే వీరి మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడంలో కూటమి పెద్దలు విఫలం కావడంతో ఇవాళ జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు అవసరమైన కోరం లేకుండా పోయింది. దీంతో రేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వ్యవహారంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి.
ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ.. ఆ మూడు డిమాండ్లపై సస్పెన్స్ !
విశాఖ నగర పాలక సంస్ధలో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడటంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫోన్ చేసి లోకేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఎలాగైనా ఎన్నిక జరిగేలా చూస్తామని ఆయన లోకేష్ కు హామీ ఇచ్చారు.
మరోవైపు విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సాక్షిగా కూటమి పార్టీల మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పోరేటర్ల మధ్య తేడాలు ఉండటం వల్ల కోరంకు సరిపడే కార్పోరేటర్లు ఈ ఎన్నికకు హాజరుకాలేదని తెలుస్తోందన్నారు. కూటమి పార్టీలకు అధికారం, దానిని అడ్డం పెట్టుకుని దోచుకోవడమే ముఖ్యమన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనే లేదన్నారు. కూటమి పార్టీలకు చిత్తశుద్ది ఉంటే, కోరంకు సరిపడే సంఖ్యాబలం ఉండి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎందుకు చేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. సుమారు 63 మంది కార్పోరేటర్లు వారికి ఉండి కూడా దాదాపు ఇరవై మందికి పైగా కార్పోరేటర్లు ఈ ఎన్నికకు గైర్హాజరు అయ్యారని, ఈ పరిణామాలను బట్టి చూస్తే, కూటమి పార్టీలకు అధికారం మాత్రమే ముఖ్యమని తెలుస్తోందన్నారు.