తాడిమర్రి (yes9tv) చిల్లకొండయ్యపల్లిలో స్వామివారి ఉత్సవం మధ్యలో నిలిపివేత
తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో శ్రీ కాటి కోటేశ్వర స్వామి మరియు శ్రీ ఆరవేడు పట్నం పెద్దయ్య స్వామివారి గుర్రపు ప్రతిమలను వీర బాలయ్య గుడి వద్ద నుంచి పెద్దకోట్ల గ్రామానికి తీసుకెళ్లి వీర స్వాముల భేటీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యథావిధిగా చిల్లకొండయ్యపల్లి గ్రామంలో స్వామివారి గుర్రపు ప్రతిమల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయితే స్వామివారి పూజారుల కొలువు మరియు బలి పిల్ల విషయంలో ఇరుకాపుల మధ్య వివాదం తలెత్తడంతో ఉత్సవాన్ని మధ్యలోనే నిలిపివేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై కృష్ణవేణి యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మండల కన్వీనర్ కూర్చి రాము, మాజీ ఎంపీపీ కొడిదల రాజశేఖర్, మాజీ కన్వీనర్ కొడిదల సాయి, మద్దినేని రమణ తదితరులు ఇరువర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. రేపటి కార్యక్రమం యథావిధిగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సంఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు భక్తులు తెలిపారు.
చిల్లకొండయ్యపల్లిలో నిలిచిపోయిన స్వామివారి ఉత్సవం: ఇరువర్గాల మధ్య వివాదంతో ఉద్రిక్తత
