అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామ శివార్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ లోకేష్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు.
చెన్నంపల్లి, నూతిమడుగు గ్రామ శివార్లలోని పెన్నా నది పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల పరిసర ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో వేసిన బోర్లలో నీటి మట్టం తగ్గిపోతుందని రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రకృతి సంపద అయిన ఇసుకను అక్రమంగా తరలిస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 9490108374 నంబర్‌కు సమాచారం అందించాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మండల ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ లోకేష్ కుమార్ కోరారు.
