ఏపీలో కొత్త పథకం..! రూ. 25 లక్షల వరకు..

చంద్రబాబు సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసిన ముసాయిదా ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే ప్రకటన రానుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.

 

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటివరకు ఆరోగ్య పథకంపై ప్రభుత్వం ఎలాంటి చలనం రాలేదు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు లేకపోలేదు. సామాన్యుడికి కావాల్సింది తిండి, గూడు, ఆరోగ్యమని అంటున్నారు. ఇప్పటివరకు వీటిలో ఏదీ అమలు కాలేదని పెదవి విరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

 

రేపో మాపో ఆరోగ్యం పథకంపై ప్రకటన

 

రీసెంట్‌గా ఏపీ వ్యాప్తంగా సర్వే చేయించింది ప్రభుత్వం. ఆ నివేదికను ఇటీవల సీఎం చంద్రబాబు బయటపెట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమాను అందించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వైద్య సేవలను బీమా పద్ధతిలో అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికి వైద్య ఆరోగ్య శాఖ ఒక ముసాయిదాను తయారు చేసింది.

 

ఆ ముసాయిదా ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే ప్రకటన రానుందని అంటున్నారు. అయితే పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

 

ఏపీలో దాదాపుగా 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో దారిద్య్ర రేఖకు ఎగువన 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా ఆరోగ్య బీమా పథకం వర్తించాలని భావిస్తోంది. బీమా కంపెనీల ద్వారా రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. అంతకు మించితే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది.

 

రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

 

దాదాపు రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును ట్రస్టు భరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని హైబ్రిడ్ విధానం అంటారు. ఆ తరహా పద్దతి చాలా రాష్ట్రాల్లో అమలు అవుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాలను రెండు భాగాలుగా చేసి టెండర్లను పిలవనున్నారు. ప్రస్తుతం వైద్య సేవలు 3,257 రకాల చికిత్సలకు అందిస్తున్నారు. వీటిని కొనసాగించడంతోపాటు బీమా విధానంలో 2,250 చికిత్సలు ఇవ్వనుంది.

 

ఏడాది కాల పరిమితితో బీమా కంపెనీలను ఎంపిక చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత రెండేళ్ల వరకు బీమా కంపెనీలకు రెన్యువల్‌తో అనుమతులు కంటిన్యూ అవుతాయి. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు టెండర్లను పిలవాలని నిర్ణయించారు.

 

నేషనల్ హెల్త్ అథారిటీ-NHI ఐటీ అప్లికేషన్‌ను ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఉపయోగించనుంది. బీమా విధానంలో ఇదే పద్ధతిని అనుసరించాలని భావిస్తోంది ప్రభుత్వం. రోగి ఆసుపత్రిలో చేరిన నుంచి డిశ్ఛార్జి అయ్యేవరకు రోగ నిర్ధారణ పరీక్షలు, ఆపై రిపోర్టులు, క్లెయిమ్స్‌ వచ్చినప్పుడు తప్పులను గుర్తించడానికి ఏఐని ఉపయోగించనున్నారు.

Posted Under AP
Editor