ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తి కావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు అధికారులకు రెండు రోజుల సమయం పట్టింది.

 

రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. వాటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి 47 నామినేషన్లు రాగా..శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

 

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2,705 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 52 నామినేషన్లు దాఖలు కాగా..అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 29 వరకూ గడువు విధించింది. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు.

Posted Under AP
Editor