9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల.. వాటికే పెద్దపీట.

ఏపీ ఎన్నికల సమరంలో తుది పోరుకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేశారు. ఇప్పుడంతా ప్రచారపర్వంలో మునిగిపోయారు. తాజాగా వైసీపీ అధిష్ఠానం మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం 58 నెలల్లో అమలు చేశామన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని, దానిని తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామన్నారు. దేవుడిదయతో అందరికీ మంచి చేశామన్నారు. వైసీపీ మేనిఫెస్టోను అమలు చేసిన తీరు.. చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

 

గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రూ.2 లక్షల 70 వేల కోట్లను డీబీటీ ద్వారా అందించామన్నారు. ఇచ్చిన హామీలను చెప్పిన టైమ్ ప్రకారం అమలు చేసి.. ప్రజల్లో హీరోగా నిలిచామని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్, అర్హులకు ఇళ్లు, పెన్షన్లు, అర్హులైన వారికి పథకాలను అందించినట్లు తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు సంపద సృష్టించకపోగా.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని విమర్శించారు. 2014లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను సరిగ్గా అమలుచేయలేకపోయారని, ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సంపద సృష్టి, సమర్థ ఆర్థిక పాలన లేదని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే.. వైసీపీ పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

 

సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రెండుపేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్ చేయూతను కొనసాగించారు. 9 ముఖ్యమైన హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, ఉన్నత విద్య, అభివృద్ధి, సామాజిక భద్రతతో మేనిఫెస్టోను రూపొందించారు. వైసీపీ అమలు చేయగలిగే హామీలనే చెబుతుందని, ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వదని తెలిపారు.

 

వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు

 

వైఎస్సార్ కాపునేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు

 

వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో రూ.45 వేల నుంచి రూ. లక్ష 5 వేలకు పెంపు

 

అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు

 

వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకు రుణాలు

 

అర్హులై ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్ల స్థలాలు అందజేత

 

వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు

 

రెండు విడతల్లో పెన్షన్లు రూ.3000 నుంచి రూ.3500కు పెంపు (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250)

 

రైతు భరోసా పథకం కొనసాగింపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా.. రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు

 

3 దఫాల్లో రైతులకు ఐదేళ్లలో రూ.80వేలు

 

ఆటో, లారీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా

 

లా నేస్తం, మత్స్యకార భరోసా కొనసాగింపు

 

ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు, జిల్లాకొక స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ

Editor