ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వాడుతున్నారా ? కేంద్రం హై రిస్క్ వార్నింగ్..!

దేశంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్, విజన్ ప్రో హెడ్ సెట్ లతో పాటు యాపిల్ సంస్ధకు చెందిన ఉత్పత్తులు వాడుతున్న యూజర్లకు కేంద్రం ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. పలు యాపిల్ ఉత్పత్తులలో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా హ్యాకర్లు చొరబడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

 

యాపిల్ ఉత్పత్తుల్లో ఉన్న 17.4.1కి ముందు ఉన్న సఫారీ వెర్షన్‌లు, 13.6.6కి ముందు యాపిల్ మ్యాక్ ఓఎస్ వెంచురా వెర్షన్‌లు, 14.4.1కి ముందు ఉన్న యాపిల్ మ్యాక్ సోనోమా వెర్షన్‌లు, 1.1.1కి ముందు ఉన్న యాపిల్ విజన్ ఓఎస్ వెర్షన్‌లతో సహా అనేక రకాల యాపిల్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లు భద్రతా ఉల్లంఘనలకు దారీ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్రం హెచ్చరిచింది.అలాగే యాపిల్ ఫోన్లలో, ఐప్యాడ్ లలో 17.4.1కి ముందు ఉన్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌లు, 16.7.7కి ముందు ఉన్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ వెర్షన్‌లు కలిగి ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

హ్యాకర్లు తాము ఎంచుకున్న సిస్టమ్ లలో ఆర్బిటరీ కోడ్ ను యాక్టివేట్ చేసేందుకు ఈ వెర్షన్లలో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం తాజా హెచ్చరికల్లో పేర్కొంది. ముఖ్యంగా వెబ్‌ఆర్‌టిసి, కోర్‌మీడియాలో రాతపూర్వక సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలిపింది. ఆయా యాపిల్ ఉత్పత్తులపై దాడి చేసేవారు వాటిని రిమోట్‌గా కాంప్రమైజ్ కావడానికి ఇది వీలు కల్పిస్తుందని హెచ్చరించింది.

 

కాబట్టి ఐఫోన్ ఎక్స్ ఎస్, ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ వినియోగదారులు 17.4 కంటే ముందు ఐఓఎస్ , ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌లను వాడుతున్న వారు,ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్, ఐఫోన్ ఎక్స్,ఐఫోన్ ఎక్స్, ఐప్యాడ్ ఐదో జనరేషన్, ఐప్యాడ్ ప్రో 9.7 అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాల ఫస్ట్ జనరేషన్ వినియోగదారులు తమ డివైజ్ లను 16.7.7, ఆ తర్వాతి వెర్షన్ ఓఎస్ లకు అప్ డేట్ కాకపోతే ప్రమాదం తప్పదని కేంద్రం తెలిపింది.

 

అలాగే మ్యాక్ బుక్ వినియోగదారులు కూడా తమ సిస్టమ్‌లను అప్‌డేట్ చేయవలసిందిగా కేంద్రం సూచించింది. 13.6.6 కంటే ముందున్న మ్యాక్ బుక్ వెచురా వెర్షన్‌లు, 14.4.1కి ముందు ఉన్న మ్యాక్ బుక్ సోనోమా వెర్షన్‌లు ప్రమాదకరం అని తెలిపింది. యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ వినియోగదారులు 1.1.1కి ముందు విజన్ ఓఎస్ లు వాడొద్దని సూచిస్తోంది. యాపిల్ ఓస్, ఐప్యాడ్ ఓఎస్, విజన్ ఓఎస్ సెక్యూరిటీ ప్యాచ్ లు ఉన్న తాజా వెర్షన్ లకు అప్ డేట్ కావాలని కోరుతోంది. అలాగే వీరంతా సురక్షితం కాని వైఫై నెట్ వర్క్ లకు కనెక్ష్ కావొద్దని కోరుతోంది.

Editor