జబర్దస్త్ అభిమానులకు షాక్… ఆగిపోతున్న లెజెండరీ కామెడీ షో..? కారణం ఇదే..!

జబర్దస్త్ బుల్లితెరపై ఒక సంచలనం. 2013లో ప్రయోగాత్మకంగా ఈ కామెడీ షో ప్రారంభమైంది. హిందీలో పలు కామెడీ షోలు సక్సెస్ అయ్యాయి. భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. వాటి స్ఫూర్తితో జబర్దస్త్ రూపొందించారు. మొదట్లో వేణు వండర్స్, రోలర్ రఘు, షకలక శంకర్, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర వంటి టీమ్స్ ఉండేవి. రోజా, నాగబాబు జడ్జెస్ గా అనసూయ యాంకర్ గా మొదలైన ఈ షో చరిత్ర సృష్టించింది. ఏళ్ల తరబడి తిరుగు లేకుండా సాగింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది కమెడియన్స్ స్టార్స్ గా ఎదిగాక షో పీక్స్ కి చేరింది.

 

More

From Tollywood

జబర్దస్త్ ని తలదన్నే షో తెలుగులో లేదనే స్థాయికి చేరింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకదాన్ని మించి మరొకటి టీఆర్పీ రాబట్టేవి. రష్మీ, అనసూయ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, రచ్చ రవితో పాటు ఎందరో స్టార్స్ అయ్యారు. వెండితెర మీద కమెడియన్స్ గా రాణించే స్థాయికి ఎదిగారు. జబర్దస్త్ కి పోటీగా ఎన్ని షోలు వచ్చినా సక్సెస్ కాలేదు. జబర్దస్త్ షో దరిదాపుల్లోకి కూడా పోలేదు.

 

ఎంత సక్సెస్ఫుల్ షో అయినా ఏదో ఒక దశలో ప్రతికూలత ఎదుర్కొంటుంది. స్టార్స్ ఒక్కొక్కరిగా షోని వీడటం మైనస్ అయ్యింది. 2019లో వివాదాలతో జడ్జి నాగబాబు షో వీడాడు. అది మొదటి దెబ్బ. తర్వాత సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి టాప్ కమెడియన్స్ జబర్దస్త్ కి దూరమయ్యారు. వారు వెళ్ళిపోయాక జబర్దస్త్ కి గుండె కాయలా ఉన్న హైపర్ ఆది కూడా గుడ్ బై చెప్పేశాడు.

 

వీటన్నింటికీ మించి అనసూయ షోని వీడటం మరో మైనస్. మంత్రి అయ్యాక రోజా కూడా జబర్దస్త్ ని వదిలేసింది. ఇలా జబర్దస్త్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జడ్జెస్, కమెడియన్స్, యాంకర్స్ షో నుండి వెళ్లిపోయారు. దాదాపు కొత్త కమెడియన్స్ తో సాగుతున్న షో కిక్ ఇవ్వడం లేదు. ఒకప్పటి టీఆర్పీ రావడం లేదు. జబర్దస్త్ కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టార్ మా పరివారం వంటి షోలు అధిక టీఆర్పీ రాబడుతున్నాయి. ఈ క్రమంలో మల్లెమాల సంస్థ షోకి తెరదించనుందట. పదేళ్ల ప్రస్థానం పూర్తి అయిన నేపథ్యంలో జబర్దస్త్ షో ఆపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Editor