వాయు కాలుష్య విషపు కోరాలకు ఇంకెంతమంది బలి కావాలి…

 

 

వాయు కాలుష్య భూతం విషకోరలు సాచి మృత్యు భీకరంగా విజృంభిస్తోంది… ఆ ధాటికి ప్రధానంగా దక్షిణ, తూర్పు ఆసియాలో మరణమృదంగం ఆగకుండా మోగుతోంది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ రసాయన సంస్థకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం తాజా అధ్యయనం ధ్రువీకరిస్తున్న యధార్థమిది. ఆరుబయట అన్ని రకాల కాలుష్యాల మూలాన ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో 83 లక్షల మరణాలు చోటు చేసుకున్నాయన్న అధ్యయనం, అందులో 51 దాకా(61శాతం) శిలాజ ఇంధనాలతో ముడివడినవేనని నిగ్గు తేల్చింది.

బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యం చైనాలో ఏటా సుమారు 24 లక్షల మంది ప్రాణాల్ని కబళిస్తోంది. ఇండియాలో అలా కడతేరిపోతున్నవారి సంఖ్య సంవత్సరానికి 21.8 లక్షలు!

 

లక్షలాది అర్ధాంతర మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతోందన్న మునుపటి ‘లాన్సెట్’ నివేదికాంశాలతో పోలిస్తే- పోనుపోను గాలి ఎంత ఉద్ధృతంగా ప్రాణాలు తోడేస్తున్నదో ప్రస్ఫుటమవుతోంది. ఈ ఉత్పాతానికి విరుగుడుగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నియంత్రించడం శ్రేయస్కరమన్నది

జర్మనీ శాస్త్రవేత్తల సూచన. తద్వారా దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియా ప్రాంతంలో ఏటా 38 లక్షల మరణాలను తగ్గించవచ్చన్నది వారి అంచనా. పెట్రోలు, డీజిల్ కలిపి ఉపయోగించగల జీవ ఇంధనంగా ఇథనాల్ దేశంలో ఇప్పటికే కీలక ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇథనాల్ నిల్వల్ని ట్యాంకర్ల ద్వారా నిర్దేశిత గమ్యస్థానాలకు పంపించి టన్నుల కొద్దీ కర్బన ఉద్గారాల విడుదలకు అవకాశం ఇవ్వకుండా ఇండియా జాగ్రత్తపడాలి.

 

బ్రెజిల్ తరహాలో ఆ నిల్వల్ని పైపులైన్లు, రైళ్లు, నౌకల సాయంతో తరలించడం మంచిది. ఇప్పటికన్నా సౌరవిద్యుత్తుకు, ఎలెక్ట్రిక్ వాహనాలకు విశేష ప్రాధాన్యం కల్పించాలనీ. చౌకలో స్వచ్ఛరవాణా సాకారమైతే వాయు నాణ్యత మెరుగుపడుతుందనీ జే ఎస్ ఆర్ ప్రభుత్వాలను కోరారు.

 

పీఎం 2.5గా వ్యవహరించే సూక్ష్మ ధూళి కణాల ప్రజ్వలనం కారణంగా దేశంలో అర్ధాంతర మరణాల సంఖ్య 20 ఏళ్లలో రెండున్నర రెట్లయిందని వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం (సీఎస్ఈ) నిరుడు వెల్లడించింది. అప్పట్లో అది పేర్కొన్న వాయుకాలుష్య మరణాల సంఖ్య 16.7 లక్షలు. నాటితో పోలిస్తే తాజా అంచనాల్లో అయిదు లక్షలకు పైగా పెరుగుదల తక్షణ దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను చాటుతోంది. దేశ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్య మహోధృతికి పంట వ్యర్థాలను తగలబెడుతున్న పంజాబ్, హరియాణా రైతులే ప్రధాన బాధ్యులన్న అధికార వర్గాల సూత్రీకరణను సుప్రీంకోర్టే తోసిపుచ్చింది. ఎవరి వాదన ఎలా ఉన్నా- ప్రత్యామ్నాయాల అన్వేషణ మాత్రం ఉపేక్షించరానిది. శ్రుతి మించిన వాహన ఉద్గారాలు, బాధ్యతను పూర్తిగా గాలికొదిలేసిన పరిశ్రమలు, విపరీత ధూళి, బాణసంచా… ఇవన్నీ పీల్చడానికి వీల్లేనంతగా గాలిని విషకలుషితం చేసేస్తున్నాయి.

 

వాయునాణ్యత అడుగంటి గాలి పీల్చిన పాపానికి దిల్లీవాసులు పన్నెండేళ్ల దాకా ఆయుర్దాయం కోల్పోవాల్సి వస్తోంది. ఒక్క దిల్లీలోనే అనేముంది- ప్రపంచంలోని 30 అత్యంత కలుషిత నగరాల జాబితాలో 21 21 భారత్కు చెందినవే.

 

గతంలో సుప్రీంకోర్టు అభివర్ణించినట్లు- గ్యాస్ చాంబర్ల వంటి నగరాల్లో జాతిజనుల జవసత్వాలు ఉడిగిపోతున్నాయి. 132 నగరాల్లో చేపట్టిన జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం (ఎన్క్యాప్) ఆశించిన స్థాయిలో ఫలవంతం కాలేదని సీఆర్ఏ(ఇంధన వాయుశుద్ధి పరిశోధన కేంద్రం) ఆమధ్య సూటిగా విమర్శించింది. శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు, గర్భస్రావాలు, మధుమేహం కేసులు… ఇవన్నీ వాయుకాలుష్యం వాటిల్లజేస్తున్న అనర్ధాలే!

 

కొలంబియా, ఇండొనేసియా వంటివి ప్రజారవాణాకు విశేష ప్రాధాన్యం కల్పించి వాయునాణ్యతను పెంపొందించుకుంటున్నాయనీ జెఎస్ఆర్ తెలిపారు.డెన్మార్క్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రియా ప్రభృత దేశాలు వాహన ఉద్గారాలను పటిష్టంగా నియంత్రిస్తున్నాయి. అటవీ ప్రాంతాల సంరక్షణకు, కలుషిత పరిశ్రమల కట్టడికి చైనా పకడ్బందీగా పథకాలను అమలుపరుస్తోంది. వాటినుంచి ఇండియా విలువైన పాఠాలు నేర్వాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం జోరెత్తడంతోపాటు వాయునాణ్యత పరిరక్షణలో ప్రజాభాగస్వామ్యం చురుకందుకుంటేనే- జాతి తేలిగ్గా ఊపిరి పీల్చుకోగ గలుగుతుందని ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాల్సి ఉంది.

Editor