తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. అటు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని గెలుపొందేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. బిజెపి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని రాజకీయ పార్టీలు జారవిడుచుకోవడం లేదు. బిజెపి, కాంగ్రెస్ అగ్ర నాయకత్వాలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. అగ్ర నాయకులు క్యూ కడుతున్నారు. సభలు, సమావేశాలతో పాటు వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. అయితే వీటన్నింటికీ మించి సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారా? అన్నదానిపైనే.. అన్ని పార్టీల గెలుపోటములు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
More
From Ap politics
ఏపీలో ప్రస్తుతం వైసిపి అధికారంలో ఉంది. సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అన్న, కెసిఆర్ అన్న వైసిపి శ్రేణులు ఓన్ చేసుకుంటున్నాయి. రెండు పార్టీలకు ఇన్ని రోజులు పాటు చంద్రబాబే ప్రత్యర్థి కావడంతో తెలంగాణలో ఉన్న వైసీపీ సానుభూతిపరులు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సామాజిక వర్గపరంగా అయితే మాత్రం వైసీపీ సానుభూతిపరుల్లో భిన్న వాతావరణం నెలకొంది. రెడ్డి సామాజిక వర్గం కొంతవరకు కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం నేత సీఎం అయ్యే ఛాన్స్ ఉండడమే ఇందుకు కారణం. అయితే వైసిపి అధికారికంగా ప్రకటించకున్నా.. ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు మాత్రం ఎక్కువమంది బిఆర్ఎస్ వైపే నని తేలుతోంది.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఎటువైపు ఓటు వేస్తారు అన్నది ప్రశ్నార్ధకం. తెలంగాణలో ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఇంతవరకు వెల్లడి కాలేదు. చంద్రబాబు జైల్లో ఉండడంతో.. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనుక రెండు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. బిజెపికి మద్దతు తెలిపేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు మరో టాక్ నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ బాహటంగా నైనా, పరోక్షంగా నైనా మద్దతు తెలిపే విధానం బట్టి ఎందుకు ఎన్నికల నుంచి తప్పుకుందో అర్థమవుతుంది.
చంద్రబాబు అరెస్ట్ చేయించింది జగన్. తెర వెనుక ఉన్నది బీజేపీ అని మొన్నటి వరకు టీడీపీ ప్రచారం చేసింది.. అందుకే తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ లోని టిడిపి సానుభూతిపరులు బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహటంగానే తమ ఆవేదనను వెలిబుచ్చారు. అటువంటి వారంతా పార్టీ ప్రకటనతో సంబంధం లేకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిని గ్రహించిన బిజెపి అధినాయకత్వం చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదన్న సంకేతాలు ఇచ్చింది. లోకేష్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని మరి అమిత్ షా ధైర్యం చెప్పారు. ఇటీవల చంద్రబాబుకు బెయిల్ దక్కడం వెనుక కేంద్ర పెద్దల సాయం ఉందని కూడా కొత్త టాక్ ప్రారంభమైంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ వైపు కమ్మ సామాజిక వర్గం, సెటిలర్స్ వెళ్లకుండా టిడిపి నాయకత్వం ఏమైనా సూచనలు, ఆదేశాలు ఇస్తుందా అన్నది చూడాలి. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.