జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు.
రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.
గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.