ఈ ప్రపంచంలో జరిగే ఒక విషయం మరొక విషయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్నే కార్యకారక సంబంధం అంటారు. ఇదే విషయాన్ని నాన్నకు ప్రేమతో సినిమాలో దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు.
సరే అది సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. ఇక నిజ జీవితంలో కూడా అలానే జరుగుతుందా? అలాంటి ఘటనలకు సంబంధించి ముందే సంకేతాలు వెలుపడతాయా? అంటే దీనికి అవును అనే సమాధానం వస్తోంది. కాకపోతే ఇక్కడ చంద్రయాన్_3 కి క్రికెట్ వరల్డ్ కప్ కు ముడి పెట్టడమే ఒకింత ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా జరుగుతుందా? లేదా? అనేది పక్కన పెడితే.. భారత నెటిజన్ల “పామలజీ” మాత్రం రాధే శ్యామ్ లో ప్రభాస్ ను మించిపోతోంది.
చంద్రయాన్_3 విజయవంతమైంది.. దేశవ్యాప్తంగా ప్రజల ఉత్సాహం మిన్నంటిది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. చంద్రయాన్_2 విఫలం కావడంతో.. ఆ ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్_3 ని పగడ్బందీగా రూపొందించారు. దీంతో విక్రం లాండర్ సేఫ్ గా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయింది. ఫలితంగా ఇస్రో శాస్త్రవేత్తల మీద అభినందనల జల్లు కురుస్తోంది.
ఇస్రో విజయం సాధించింది కాబట్టి ప్రస్తుతం దానిమీద ప్రశంసల జల్లు కురవడం సాధారణమే. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు చంద్రయాన్_3 కి అనేక విషయాలను జోడిస్తున్నారు. కాకపోతే అవి ఆ ప్రయోగానికి సంబంధించినది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా అన్వయించుకుంటున్నారు. అయితే వీటిని కొట్టి పారేయడానికి కూడా లేదు. ఇక 2019లో చంద్రయాన్_2 విఫలమైన నేపథ్యంలో ఆ ఏడాది భారతీయులకు కలిసి రాలేదు. ఆ ప్రయోగం విఫలం కావడం దేశం మొత్తాన్ని నిర్వేదంలో ముంచేస్తే.. అదే ఏడాది జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ సెమి ఫైనల్ దాకా వెళ్ళింది. అక్కడ నిరాశపరిచి ఇంటికి వచ్చింది. చంద్రయాన్_2 లో కూడా ఇస్రో సేఫ్ లాండింగ్ వరకు వెళ్ళింది. కానీ చివరికి విక్రమ్ విఫలం కావడంతో శాస్త్రవేత్తల శ్రమ వృధా అయ్యింది. టీమిండియా జట్టు కూడా సెమీఫైనల్ దాకా వెళ్ళింది. కప్ కు రెండు అడుగుల దూరంలో నిష్క్రమించింది.
ఇక ప్రస్తుతం చంద్రయాన్_3 విజయవంత కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు శుభాకాంక్షలు మోతెక్కి పోతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఇస్రో విజయం సాధించిన నేపథ్యంలో.. అదే పరంపర టీం ఇండియా కూడా కొనసాగిస్తుందని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే 2019లో చంద్ర యాన్ _2 విఫలమైంది. భారత క్రికెట్ జట్టు కూడా ఇంటి బాట పట్టింది. ఏడాది ఇస్రో చంద్రయాన్_3 ని విజయవంతంగా పూర్తి చేసింది కాబట్టి టీమిండియా కూడా స్వదేశంలో జరిగే క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధిస్తుందని భారత క్రికెట్ అభిమానులు నమ్ముతున్నారు.. వరల్డ్ కప్ గెలుచుకొని దేశం మీసం తిప్పాలని క్రీడాకారులను వారు కోరుతున్నారు. మరి క్రికెటర్లు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.