రైతు ఆత్మహత్య – రామాపురం గ్రామంలో విషాదం
తాడిమరి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రైతు సి. ఓబులేష్ (33) అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఓబులేష్‌కు భార్య లక్ష్మి, పెద్ద కూతురు మధుప్రియ (11), చిన్న కూతురు బిందు (8), కుమారుడు శివ శంకర్ వరప్రసాద్ (6) ఉన్నారు. ఆయనకు మొత్తం మూడు ఎకరాల భూమి ఉంది. అందులో సర్వే నెంబర్ 30లో ఒక ఎకరం, సర్వే నెంబర్ 19లో రెండు ఎకరాల్లో చీనీ చెట్లు, కనకాంబరాల తోట సాగు చేస్తున్నారు.
వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులు పెరిగి దాదాపు రూ.10 లక్షల వరకు చేరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓబులేష్ గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో తన సొంత తోటలో పురుగుల మందు తాగారు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గంటలోపే ఆయన మృతి చెందారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: రామాపురం గ్రామంలో విషాదం
