ఆలూరులో భారీ చోరీ.. రూ.10 లక్షల నగదు, రెండు తులాల బంగారం అపహరణ
కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని కోయనగర్ వీధిలో భారీ చోరీ జరిగింది. కోయనగర్‌లో నివాసముంటున్న పండ్ల వ్యాపారి బండారి బజారప్ప ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రివేళ దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ.10 లక్షల నగదు, రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితుడు బజారప్ప తెలిపారు.
ఇటీవల పొలం విక్రయించి వచ్చిన నగదును ఇంట్లో ఉంచామని, అదే మొత్తాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం..
