తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం.. వారి ఆశీస్సులు ప్రతిరోజూ తీసుకోవాలి.. క్రమశిక్షణతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగగలరు – గుంతకల్ మండల ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి గారు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలు, గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి సూచనల మేరకు గుంతకల్ పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో గుంతకల్ మండల ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తల్లిదండ్రులే పిల్లలకు ప్రత్యక్ష దైవం. ప్రతిరోజూ వారి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటే జీవితంలో మంచి మార్గంలో ముందుకు సాగుతారు” అని విద్యార్థులకు సూచించారు.
తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని గుర్తుచేసుకుంటూ, అప్పట్లో ఇక్కడి నుంచి ఎస్.జె.పి. స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి తిరిగి వచ్చేవాళ్లమని, కనీసం కాళ్లకు సరైన చెప్పులు కూడా ఉండేవి కావని చెప్పారు.
నేడు కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ మిషన్ ద్వారా విద్యార్థులకు బ్యాగులు, రెండు జతల యూనిఫాంలు, షూస్, బెల్ట్, నోట్‌బుక్స్ తదితర విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారని వివరించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే “తల్లికి వందనం” పథకం ద్వారా కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువస్తోందని పేర్కొన్నారు.
చివరగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, మంచి విలువలను అలవర్చుకుని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకుని, వారితో కలిసి భోజనంలో పాల్గొన్నారు.
