ఎలాన్‌ మస్క్‌ సంచలన అంచనా.. 10 ఏళ్లలో 100 కోట్ల హ్యూమనాయిడ్‌ రోబోలు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, హ్యూమనాయిడ్‌ రోబోటిక్స్‌ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అదే సమయంలో మరో పదేళ్లలో హ్యూమనాయిడ్‌ రోబోలు భారీ సంఖ్యలో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.

మస్క్‌ అంచనా ప్రకారం.. వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల హ్యూమనాయిడ్‌ రోబోలు ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలు, సేవలు, తయారీ రంగం సహా అనేక విభాగాల్లో ఈ రోబోలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మానవులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోలు నిర్వహించే పరిస్థితి రావచ్చని ఆయన సూచించారు.

ఒక్కో హ్యూమనాయిడ్‌ రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోబోల మొత్తం ఉత్పాదకత మానవ శక్తిని మించిపోయే అవకాశం ఉందని మస్క్‌ అన్నారు. ఈ అంచనాలు నిజమైతే ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల పనితీరులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో మస్క్‌ వ్యాఖ్యలు టెక్‌ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి.

Editor