2025 మేలో జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారతదేశంపై తాము భారీ స్థాయిలో దాడులు చేసినట్లు చూపిస్తూ పాకిస్థాన్ వైమానిక దళం ఓ యానిమేషన్ వీడియోను విడుదల చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఫిజాఓన్ కే పాస్బాన్’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో పాక్ సైన్యం సాధించినట్లు చెబుతున్న పలు విజయాలను గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. అయితే ఈ వాదనలకు మద్దతుగా అసలు ఫోటోలు, ఉపగ్రహ చిత్రాలు లేదా ఇతర స్వతంత్ర ఆధారాలు వీడియోలో కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీడియోలో భారతదేశానికి చెందిన రెండు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను ధ్వంసం చేశామని, 32 ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశామని పాకిస్థాన్ చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా భారత పార్లమెంట్, గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు గ్రాఫిక్స్‌లో ప్రదర్శించారు. నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు, సుఖోయ్, మిగ్-29, మిరాజ్ 2000తో పాటు హెరాన్ డ్రోన్‌ను కూల్చినట్లు కూడా వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంత భారీ స్థాయిలో దాడులు జరిగాయని చెబుతున్నప్పటికీ.. ఆయా ఎయిర్‌బేస్‌లలో రన్‌వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు చూపించే నమ్మదగిన ఉపగ్రహ చిత్రాలు లేదా ఇతర ఆధారాలు బయటకు రాలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ తన సైనిక విజయాలను అతిశయోక్తిగా చూపించేందుకు AI, యానిమేషన్ గ్రాఫిక్స్‌ను ఉపయోగించిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే వీడియోలోని ప్రతి వాదనను స్వతంత్ర ఆధారాలతో ధృవీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
