ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మీరట్ జిల్లా మవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ వ్యాలీ పబ్లిక్ స్కూల్‌లో 13 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న కునాల్ శర్మ.. సోమవారం ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు బయలుదేరుతుండగా.. కునాల్ మాత్రం బయటకు రాలేదు.
పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఈ-రిక్షా డ్రైవర్ దాదాపు 15 నిమిషాల పాటు కునాల్ కోసం వేచి చూశాడు. ఎంతకీ బాలుడు రాకపోవడంతో అనుమానం వచ్చి పాఠశాలలో వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వాష్‌రూమ్ వద్ద కునాల్ స్పృహతప్పి పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే కునాల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించినట్లు సమాచారం. మవానా ప్రాంతంలోని కాబిలీ గేట్, కళావదా రోడ్డుకు చెందిన ధర్మేంద్ర శర్మ కుమారుడైన కునాల్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. రోజూ నవ్వుతూ పాఠశాలకు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
