రేవంత్ రెడ్డి బిచ్చగాడు; బీజేపీలోకి వచ్చినా చేర్చుకోవటం కష్టమే: కోమటిరెడ్డి

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఘర్ వాపసీ అంటూ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళిన నేతలను ఆహ్వానించారు. ఇక బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో బీజేపీ నేతలు రేవంత్ రెడ్డికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఇప్పటికే తన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బిజెపినేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిని బిచ్చగాడి తో ఆయన పోల్చారు. రేవంత్ రెడ్డి బిజెపిలోకి వచ్చినా ఆయనను చేర్చుకోవడం కష్టమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లను మాత్రమే బీజేపీ చేర్చుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలనుకుంటే ముందు ఆయన పై ఉన్న కేసులు పరిశీలించాలని, క్లీన్ ఇమేజ్ ఉంటేనే పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాస్యాస్పదమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వలసవాది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను ఒక లక్ష్యం కోసం బీజేపీలో చేరానని, బీజేపీని వీడి వెళ్లే ప్రసక్తేలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక త్వరలో కెసిఆర్ కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో బీజేపీ లో కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశాలు ఇస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పార్టీలో ఉన్న బలమైన నేతలను బిజెపి నాయకత్వం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపరులపై కఠినంగా వ్యవహరించాలని, ఆధారాలు కావాలి అంటే తాము ఇస్తామని చెప్పామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తే రేవంత్ లాంటి వాళ్ళను బీజేపీలో చేర్చుకోరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

YES9 TV