- అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం
- సామాజిక పెన్షన్ సాయం కాదు… ఓ ఆర్థిక భరోసా
సామాజిక పింఛన్ ప్రతి పేద కుటుంబానికి ఓ ఆర్థిక భరోసా, భద్రత కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నెల క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలోని ఏదో ఒక గ్రామానికి వెళ్లి పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం మాత్రమే కాకుండా, ప్రజా వేదిక నిర్వహించి గ్రామస్తులతో నేరుగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకుంటున్నారని చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.51 వేల కోట్లను సామాజిక పెన్షన్ల పంపిణీకి ఖర్చు చేసినట్లు వివరించారు. ఇది ఏదో సహాయంగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా అమలు చేస్తున్న పథకమని స్పష్టం చేశారు. స్వయంగా జీవించలేని వారు, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, కుటుంబాలకు భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పెద్ద మొత్తంలో, ఎక్కువ మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు.
రాయదుర్గం నియోజకవర్గంలోనే 36,592 మందికి ప్రతి నెల రూ.16 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. పేదల చేతుల్లోకి నేరుగా డబ్బు చేరుతున్న ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఈ గ్రామంలో ఓ వ్యక్తి పక్షవాతంతో ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమై మాట్లాడలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ ఆ కుటుంబానికి ఎంతగానో ఉపశమనంగా నిలుస్తోందన్నారు. ఆ వ్యక్తి తనను చూసి కంటతడి పెట్టడం హృదయాన్ని కలచివేసిందని, ఇలాంటి వారికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ సంతృప్తినిచ్చే బాధ్యత అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థిక భద్రతను కల్పిస్తోందని కాలవ శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు, మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి, నాగిరెడ్డిపల్లి హనుమంతు, కదిరంపల్లి సోము, రామస్వామి, సుంకన్న, తిమ్మారెడ్డి, వేపరాళ్ల వన్నూరుస్వామి, రాఘవేంద్ర, కేంచానపల్లి మురళి, శ్రీపతి, భూషి తదితరులు పాల్గొన్నారు.
