సుకుమార్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం కావాల్సింది: డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. అయితే, దేవిశ్రీ మాట్లాడుతూ.. తన ఆప్తమిత్రుడు, దర్శకుడు సుకుమార్ తనను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారని తెలిపారు. కానీ ఆ సమయంలోనే తన తండ్రి సత్యమూర్తి గారు మరణించడంతో తాను మానసికంగా కుంగిపోయానని, అందుకే ఆ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేక సుకుమార్‌ను వేరే సినిమా చేసుకోమని కోరినట్లు డీఎస్పీ వివరించారు.

తనలోని నటనను, డ్యాన్స్ స్కిల్స్‌ను గుర్తించి ఎందరో అగ్ర దర్శకులు, నిర్మాతలు తనను యాక్టింగ్ వైపు ప్రోత్సహించారని దేవిశ్రీ గుర్తు చేసుకున్నారు. “నీలో ఉన్న టాలెంట్‌లో కేవలం 10 శాతం మాత్రమే ఇప్పటివరకు బయటకు చూపించావ్” అని త్రివిక్రమ్ అంటుండేవారని, హరీష్ శంకర్ సైతం తనను డైరెక్ట్ చేస్తానని అనేవారని చెప్పారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు కూడా దేవిశ్రీలోని ఎనర్జీని చూసి హీరోగా ప్రయత్నించమని ధైర్యాన్ని ఇచ్చారట. ‘కుమారి 21F’ వంటి సినిమాల్లో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా మారుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, తనపై నమ్మకం ఉంచిన దర్శకులకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీఎస్పీ, ఇప్పుడు నటుడిగా ఏ మేరకు మెప్పిస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బలగం’ లాంటి భావోద్వేగపూరిత చిత్రాన్ని అందించిన వేణు డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Editor