రాయదుర్గంలో మిన్నంటిన కార్మిక గర్జన: కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిఐటియు భారీ ర్యాలీ!

అనంతపురం జిల్లా – రాయదుర్గం

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రాయదుర్గం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వినాయక కూడలి నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు అంగన్వాడి, మున్సిపల్, వాటర్ వర్కర్స్ తదితర రంగాల కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

ఎమ్మార్వో కార్యాలయం వద్ద వంశీకృష్ణ అధ్యక్షతన గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు నాగరాజు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ తదితరులు మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులకు నష్టం కలిగించే నల్ల చట్టాల విషయంలో ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పినట్లే, కార్మిక వర్గానికి కూడా క్షమాపణ చెప్పేలా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకుండా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో చర్చించి కార్మికులకు న్యాయం చేసే చర్యలు తీసుకోవాలని, లేదంటే దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

కార్మికుల సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికులకు నష్టం కలిగించే ఈ చట్టాల రద్దు కోసం జరిగే పోరాటాలలో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటుందని నాయకులు తెలిపారు.

Posted Under AP
Editor