తాడిమర్రి మండలంలో దేశవ్యాప్త బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం
తాడిమర్రి మండలం: వామపక్ష పార్టీ సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు తాడిమర్రి మండలంలో విస్తృతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి నారాయణ నాయకత్వంలో అంగన్వాడి, ఆశ వర్కర్లు, సత్యసాయి వాటర్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్మిక ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు నల్ల కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ ఒప్పందాల నేపథ్యంలో సోయాబీన్ నూనె, మొక్కజొన్న, పశుగ్రాసం వంటి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
దేశాన్ని నిలబెట్టేది రైతేనని, రైతు ఓటు బ్యాంకు కాదని, దేశ ఆహార భద్రతకు అతడే ఆధారం అని నాయకులు స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్ కంటే రైతు చెమటే దేశానికి ముఖ్యమని, అమెరికా ఒత్తిళ్ల ముందు భారత రైతు తలవంచకూడదని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే అంగన్వాడి మరియు ఆశ వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు బ్యాల్ల కాటమయ్య, సిఐటియు మండల కార్యదర్శి నారాయణ, సిపిఎం మండల కన్వీనర్ ఏకపాదంపల్లి పోతలయ్య, సిఐటియు మండల అధ్యక్షురాలు భారతి, రైతు సంఘం ట్రెజరర్ రామలింగారెడ్డి, తాగునీటి సంఘం కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, ఆశ వర్కర్ కార్యదర్శి ఆదెమ్మ, అంగన్వాడి కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తాడిమర్రిలో బంద్ హోరు: ప్రజా వ్యతిరేక విధానాలపై ‘వామపక్షం’ గర్జన!
