- ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
- గంటపాటు నేషనల్ హైవే పై రాకపోకలకు అంతరాయం
రాయదుర్గం- అనంతపురం NH 544 DD జాతీయ రహదారిలోని 74 ఊడెగోళం గ్రామంలో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బోయ ఓబయ్య (45) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. రోడ్డు ప్రమాదంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాయదుర్గం నుండి అనంతపురం వైపు ప్రయాణికులతో వెళుతుండగా గ్రామంలో నుంచి ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన వ్యక్తి బస్సును ఢీకొని కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు.
అతనిని వెంటనే 108 అంబులెన్స్ లో రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతనికి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును గమనించక రోడ్డు క్రాస్ అవుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు.
దీంతో జాతీయ రహదారిపై గ్రామ ప్రజలు, బంధువులు రస్తారోకో చేయడంతో దాదాపు 1 గంట పాటు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్సై సురేష్ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పారు.
జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.
సీఐ వెంకటరమణ జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారంలోపు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని వారిని సముదాయించారు.
మృతుడి బంధువుల ఫిర్యాది మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
