గూగుల్ షాకింగ్ నిర్ణయం, గూగుల్ ప్లేస్టోర్ నుండి మ్యాట్రిమొనీ, షాదీ, నౌకరీ యాప్ లు అవుట్..!

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ ను తొలగించడం మొదలుపెట్టింది. దాదాపు పది ప్రముఖ కంపెనీలు గూగుల్ సర్వీస్ ఫీజులు చెల్లించడం లేదని పేర్కొన్న గూగుల్ వాటిపై చర్యలకు ఉపక్రమించింది.

 

వీటిల్లో ప్రముఖంగా భారత మాట్రిమోనియల్ యాప్స్ షాది, మ్యాట్రిమోనీ, భారత్ మ్యాట్రిమోనీ, నౌకరి డాట్ కామ్, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ కి చెందిన ఆల్ట్, ఆడియో ప్లాట్ఫామ్ అయిన కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ వంటి యాప్లను గూగుల్ తొలగించింది.

 

ప్రస్తుతం ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించడం లేదు అయితే గూగుల్ ప్లే స్టోర్ లో దాదాపు 15 నుండి 30 శాతంగా ఉన్న ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అయితే గూగుల్ ప్రస్తుతం 11 నుంచి 26% ఫీజు వసూలు చేస్తోంది. దీంతో పలు సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

 

అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇవ్వలేదని, అయినప్పటికీ కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని, వాటిపైన చర్యలు తీసుకున్నామని గూగుల్ పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా చార్జీలు వసూలు చేసుకునే హక్కును ఏ కోర్టు లేదా ఏ నియంత్రణ సంస్థ కానీ ఇప్పటిదాకా నిరాకరించలేదని, అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిందని గూగుల్ పేర్కొంది.

 

ఇక తాజా పరిణామాలపై, ప్లే స్టోర్ నుంచి యాప్స్ ను తొలగించడం పై భారత్ మాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగ వేలు జానకిరామన్ స్పందించారు. ఇది భారత ఇంటర్నెట్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నష్టాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కుకు ఎఫ్.ఎం కో ఫౌండర్ వినోద్ కుమార్ మీనా, క్వాక్ క్వాక్ ఫౌండర్ రవి మిట్టల్ నిబంధనలను పాటించి తిరిగి ప్లే స్టోర్ లోకి వస్తామని చెప్పారు.

Editor