ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ప్రధానమైనవి సామాజిక పెన్షన్లు. ఈ పెన్షన్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన లబ్దిదారుల ఇళ్లకు వాలంటీర్ల ద్వారా నేరుగా పంపుతోంది.
అయితే ఇందులో అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని కాగ్ కీలక సూచన చేసింది.
వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, ఎలాంటి ఆసరా లేని ఒంటరి మహిళలకు, వితంతువులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల రూపంలో బదిలీ చేస్తోంది. వీటిని వాలంటీర్లతో వారికి నేరుగా ఇప్పిస్తోంది. దీంతో ప్రభుత్వానికి కూడా మంచిపేరు వస్తోంది. అయితే ఇక్కడ పెన్షన్లు పలు చోట్ల దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో పెన్షన్లను కూడా ఇతర సంక్షేమ పథకాల తరహాలోనే లబ్దిదారులకు నేరుగా బటన్ నొక్కి అందచేయాలని కాగ్ సూచిస్తోంది. ఈ మేరకు పార్లమెంంటులో సమర్పించిన తాజా నివేదికలో ఇలా నేరుగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాలకు సూచనలు చేసింది.
ప్రస్తుతం దేశంలో ఏపీతో పాటు ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, జార్ఖండ్ లలో మాత్రమే ఇలా నేరుగా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో పెన్షన్లకు ఇస్తున్న నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆయా రాష్ట్రాల్ని కాగ్ హెచ్చరించింది. దీనికి బదులుగా వారి బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్లలో వీటిని జమ చేయాలని సూచిస్తోంది. ఈ రెండూ కుదరకపోతే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ రూపంలో అయినా ఇవ్వాలని కోరింది. ఇవేవీ అందుబాటులో లేకపోతే మాత్రమే నేరుగా డబ్బు ఇవ్వాలని సూచించింది.
ప్రస్తుతం ఏపీలో పెన్షన్లు మినహా అన్ని సంక్షేమ పథకాలు కూడా డీబీటీ విధానంలోనే అమలవుతున్నాయి. అంటే ఆయా పథకాల మొత్తాల్ని సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు. కానీ పెన్షన్లు మాత్రమే వాలంటీర్లతో పంపిణీ చేయిస్తున్నారు. ఇందులోనూ బయోమెట్రిక్ ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర పథకాల తరహాలోనే పెన్షన్లను కూడా డీబీటీ విధానంలోనే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు కాగ్ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.