తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధాన రైళ్లకు హాల్ట్ ల పైన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో ఆయా రైళ్లు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరు నెలల పాటు ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ ప్రకటించిన రైళ్లల్లో నారాయాణాద్రి..దక్షిణ్..చార్మినార్ సహా 40 రైళ్లు ఉన్నాయి. ప్రధానంగా పలు ముఖ్యమైన స్టేషన్లలో హాల్టింగ్ కోసం అభ్యర్ధనలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకొని రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
లింగంపల్లి నుంచి నుంచి తిరుపతికి వెళ్లే నారాయాణాద్రి ఎక్స్ ప్రెస్ మిర్యాలగూడెంలో ఆగుతున్నా..తిరుపతి నుంచి వచ్చే ప్రయాణంలో స్టాపేజీ లేదు. దీని కారణంగా తిరుపతి నుంచి మిర్యాలగూడెం వచ్చే వారు నల్గొండ స్టేషన్ లో దిగాల్సి వచ్చేది. అక్కడ నుంచి ప్రయాణీకులు తిరిగి మిర్యాలగూడెం వెళ్లాలంటే ఇబ్బందులు తప్పటం లేదు.
దీంతో..ఇక నుంచి సికింద్రాబాద్ – తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ అర్దరాత్రి 2.44కి మిర్యాలగూడెంలో ఆగనుంది. అదే విధంగా భువనేశ్వర్ – సికింద్రాబాద్ (17015) విశాఖ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ (12603), నాగర్ సోల్ -నర్సాపూర్ (17232) ఎక్స్ ప్రెస్ లను మిర్యాలగూడెం, నల్గొండ స్టేషన్లలో ఆపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
నర్సాపూర్ – లింగంపల్లి ఎక్స్ ప్రెస్ (17255)కు నల్గొండలో, సింగరేణి ఎక్స్ ప్రెస్ (17033)కు ఆసిఫాబాద్ లో, దక్షిణ్(12721) సంఘమిత్ర (12295) ఎక్స్ ప్రెస్ లకు రామంగుండంలో, సికింద్రాబాద్ – రాయపూర్ ఎక్స్ ప్రెస్ (12271)కు జమ్మికుంటలో, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ (12708)కి మంచిర్యాలలో, సికింద్రబాద్ – మణుగూరు ఎక్స్ ప్రెస్ (12745)కి కారేపల్లిలో, చార్మినార్ ఎక్స్ ప్రెస్ (12759)కి డోర్నకల్ లో, పద్మావతి ఎక్స్ ప్రెస్ (12763), విశాఖ- మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ (12861)లకు మధరిలో హాల్ట్ ఇవ్వాలని నిర్ణయించారు.
అదే విధంగా యశ్వంత్ పూర్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ (16569)కి శ్రీరాం నగర్, జడ్చర్ల, షాద్ నగర్ స్టేష్లన్లో హాల్టు ఇచ్చారు. రైల్వే శాఖ తాజాగా నిర్ణయించిన ఈ స్టాపేజీ సౌకర్యం ఈ నెల 5,6,7,8 తేదీల నుంచి అమల్లోకి రానుంది.
